తిరుమల : శ్రీవారి దర్శనం కల్పన పేరుతో భక్తులను మోసం చేస్తున్న 27 మంది టాక్సీ డ్రైవర్లను అరెస్ట్ చేశామని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశామని… అవసరమైతే పీడీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్ కు చెందిన ఆనంద్ వర్ధన్ ఆర్మీ డ్రెస్ ధరించి…దర్శనం కల్పిస్తానంటూ భక్తులను మోసం చేశాడని… ఆనంద్ వర్ధన్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనం టిక్కెట్లను భక్తులు కేవలం టీటీడీ వెబ్ సైట్ ద్వారానే పొందాలని.. శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పే దళారీల మాట నమ్మి భక్తులు మోసపోవద్దని సూచనలు చేశారు.. కరోనా ఆంక్షలు నేపథ్యంలో తిరుపతిలో టీటీడీ శ్రీవారి దర్శన టిక్కెట్లను జారీ చేయడం లేదని.. ఆన్ లైన్ లో టిక్కెట్లు పొందిన భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని కోరారు.
భక్తులకు అధిక ధరకు బ్రేక్ దర్శనం టిక్కెట్లను విక్రయించి మోసం చేసిన ఇద్దరు దళారులను అరెస్ట్ చేశామని… ఫేక్ సిపారస్సు లేఖతో దర్శనం టిక్కెట్లను పొంది భక్తులకు అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. భక్తులకు సిపారస్సు లేఖలు ఇచ్చే విఐపిలు లేఖను పూర్తిగా నింపి మాత్రమే భక్తులకు ఇవ్వాలని పేర్కొన్నారు.