అమరావతి : టీటీడీ అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకం, అర్చకత్వం నుంచి విరమణ నుంచి మినహాయింపు అంశాలపై ఏక సభ్య కమిటీ నియామకం చేసింది ఏపీ సర్కార్.
దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూ చైర్మన్ జస్టిస్ బి.శివశంకర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. అలాగే వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం చేయడం, క్రమబద్దీకరణకు 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది ఏపీ ప్రభుత్వం.
కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని పేర్కొన్న ప్రభుత్వం… టిటిడి అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే టీటీడీ ఛైర్మన్ గా మరోసారి వైవి సుబ్బారెడ్డి ని నియమించిన సంగతి తెలిసిందే.