కలబంద.. ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న మొక్క. ముఖ్యంగా చర్మ సంరక్షణలో దీని ప్రాధాన్యం చాలా ఉంది. చర్మాన్ని తేమగా చేయడం నుండి మొటిమలు, నల్లమచ్చలు, పొడిబారడాన్ని దూరం చేయడంలో ఇది చాలా సాయపడుతుంది. ప్రస్తుతం చర్మానికి కలబంద చేసే మేలు తెలుసుకుందాం.
ఐ క్రీమ్
కళ్ళకింద నల్లటి వలయాలు ఏర్పడడం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటప్పుడు కలబందతో మంచి పరిష్కారం దొరుకుతుంది. దీనికోసం కలబంద రసాన్ని కళ్ళకింద మర్దన చేయాలి. ఇలా రోజూ చేస్తే కళ్ళకింద ఉన్న నల్లటి వలయాలు మాయం అవుతాయి.
నల్లమచ్చలను తగ్గిస్తుంది
కలబందలో ఉండే పోషకాలు ముఖంపై ఏర్పడే నల్లమచ్చలను, మంగును పూర్తిగా తగ్గిస్తుంది. దానివల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది. దీనికోసం కలబంద రసాన్ని ముఖానికి మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం మృదువుగా తయారవడానికి కూడా ఇది కారణంగా ఉంటుంది.
వయసును తగ్గిస్తుంది
కలబందలోని పోషకాలు చర్మకణాలని వృద్ధి చేయడంలో సాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు అందులోని విటమిన్-ఏ, విటమిన్-సి చాలా మేలు చేస్తాయి. కలబంద రసంలో కొద్దిగా పాలు, తేనె కావాల్సివస్తే రోజ్ వాటర్ కలుపుకుని ఫేస్ మాస్క్ లాగా తయారు చేసుకోవచ్చు.
మొటిమలను తగ్గిస్తుంది
కలబంద రసంలో కొద్దిగా నీళ్ళు కలుపుకుని ఒక బాటిల్ లో భద్రపర్చుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ముఖానికి ఆ ద్రవాన్ని స్ప్రే చేసుకుంటే చాలు. స్ప్రే చేసుకోవాలన్న ప్రతీసారి ఆ బాటిల్ ని ఊపడం మాత్రం మర్చిపోవద్దు.