దేశంలోని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఉన్న క్లెయిమ్ చేయని డబ్బుపై కేంద్రం షాకింగ్ వివరాలను వెల్లడించింది. ఆ మొత్తం విలువ రూ.49వేల కోట్లుగా ఉందని తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానం ఇచ్చారు.
డిసెంబర్ 31, 2020 వరకు దేశంలోని బ్యాంకులు, ఇన్సూరెన్స్ వద్ద ఉన్న క్లెయిమ్ చేయని డబ్బు రూ.49వేల కోట్లుగా ఉందని మంత్రి వెల్లడించారు. బ్యాంకుల వద్ద ఉన్న ఆ మొత్తం సొమ్ము రూ.24,356 కోట్లు కాగా ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.24,586 కోట్లు ఉన్నాయి. కస్టమర్లు ఎలాంటి క్లెయిమ్‌లు చేసుకోకపోతే కొన్నేళ్లుగా ఆ మొత్తం అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఉంటుంది.
కస్టమర్లు చనిపోయినా, లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా సరే బ్యాంకుల్లో ఉన్న తమ సొమ్మును క్లెయిమ్ చేసుకోకపోయినా, ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్మును క్లెయిమ్ చేయకపోయినా.. ఆయా సంస్థల వద్దే ఆ సొమ్ము ఉంటుంది. అయితే నిర్దిష్టమైన నియమాల ప్రకారం ఆ సొమ్మును తరువాత బదిలీ చేస్తారు.
బ్యాంకుల వద్ద ఉండే అన్‌క్లెయిమ్ సొమ్మును డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ కోసం ఉపయోగిస్తారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఉండే అన్‌క్లెయిమ్ సొమ్మును సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్ కోసం ఉపయోగిస్తారు. 10 ఏళ్ల కన్నా ఎక్కువ సంవత్సరాలుగా సొమ్మును క్లెయిమ్ చేసుకోకపోతే దాన్ని పై విధంగా ఉపయోగిస్తారు.