ప్రపంచ వ్యాప్తంగా ఏటా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి హైబీపీ ఎక్కువగా వస్తోంది. అయితే గత 30 సంవత్సరాల కాలంలో హైబీపీ బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రెండింతలకు పెరిగిందని అధ్యయనంలో వెల్లడైంది.
1990లో హైబీపీ బారిన పడిన వారి సంఖ్య 648 మిలియన్లు ఉండగా వారిలో 331 మిలియన్ల మంది స్త్రీలు, 317 మంది పురుషులు ఉన్నారు. అయితే 2019 వరకు ఆ సంఖ్య 1278 మిలియన్లకు చేరుకుంది. వారిలో 626 మిలియన్ల మంది మహిళలు, 652 మిలియన్ల మంది పురుషులు ఉన్నారు. ఎక్కువగా పేద, మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాల్లోనే ఈ బాధితుల సంఖ్య పెరుగుతుందని గుర్తించారు.
ఇక భారత్ విషయానికి వస్తే మన దేశంలో గత 30 ఏళ్ల కాలంలో హైబీపీ బాధితుల సంఖ్య పురుషుల్లో 28 నుంచి 29 శాతానికి చేరుకోగా స్త్రీలలో ఆ సంఖ్య 32 నుంచి 38 శాతానికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పలువురు సైంటిస్టులు 184 దేశాలకు చెందిన 100 మిలియన్ల మంది ప్రజలపై 3 దశాబ్దాల పాటు ఈ అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో వారు పైన తెలిపిన వివరాలను వెల్లడించారు.
వ్యక్తుల బ్లడ్ ప్రెషర్ 140/90 అంతకన్నా ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీగా పరిగణిస్తారు. హైబీపీ వచ్చిన వారికి వైద్యులు మందులను ఇస్తారు. వాటిని రోజూ వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల హైబీపీని తగ్గించుకోవచ్చు.