దేశ రాజధాని ఢిల్లీకి గుబులు పుట్టించిన కరోనా వైరస్, తన విజృంభణకు ఫుల్ స్టాప్ పెట్టింది. దాదాపు సాధారణ పరిస్థితికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభ నెల మార్చ్ 2020 నుండీ చూసుకుంటే ఇప్పటివరకు అతి తక్కువ కరోనా మరణాలు సెప్టెంబరులో నమోదయ్యాయి. ఈ లెక్కన కరోనా వ్యాప్తి చాలా తక్కువయ్యిందనే చెప్పవచ్చు. సెప్టెంబర్ నెలలో కరోనా మరణాలు కేవలం ఐదు మాత్రమే. సెప్టెంబర్ 7,16, 17 తేదీల్లో ఒక్కో మరణం సంభవించగా, సెప్టెంబర్ 28వ తేదీలో రెండు కరోనా మరణాలు సంభవించాయి.
అటు పక్క కరోనా కేసులు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. సెకండ్ వేవ్ లో అత్యధిక కేసులు నమోదయిన ఢిల్లీలో అత్యల్ప కేసులు నమోదవుతున్నాయి. శవాల గుట్టలు కన్పించిన దేశ రాజధానిలో కరోనా విస్తరణ దాదాపు తగ్గిపోయినట్లే అని చెప్పుకుంటున్నారు. వ్యాక్సినేషన్ వేగంగా జరడం, కరోనా నిబంధనలు పాటించడం మొదలగు కారణాలన్నింటి వల్ల కరోనా వ్యాప్తి తొందరగా తగ్గిపోయిందని అనుకుంటున్నారు.