1977 నవంబర్ 19 యావత్ దేశాన్ని కదిలించిన రోజు. వేలాది ప్రాణాలు కడలి కలిసిన రోజు. ప్రక్రుతి ఉగ్రరూపం దాల్చిన వేళ దివిసీమ ఉప్పెన ధాటికి బలై నేటికి 44 ఏళ్లు గడిచాయి. హఠాత్తుగా సంభవించిన ఈ ఉపద్రవానికి ఒక్క దివిసీమలోనే దాదాపుగా 15 వేల మంది మరణించారు. లక్షల సంఖ్యలో పశుపక్షాదులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా తీరం వెంబడి మొత్తం 72 గ్రామాలు ఉప్పెన ధాటికి నష్టపోయాయి. అధికారుల అంచనా ప్రకారం 30 వేల మంది వరకు మరణించారు. అయితే అనధికారికంగా ఈసంఖ్య 50 వేలకు పైనే ఉంటుంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. సముద్రం 16 కిలోమీటర్ల మేర ముందుకు వచ్చి పెనువిషాదాన్ని మిగిలిచింది.
అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంకటరావు యుద్ధప్రాతిపదికన సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగు నీటిని అందించారు. ఈ ఉప్పెన ధాటికి సోర్లగొంది గ్రామంలో సుమారు 714 మంది మరణించగా.. దివిసీమలోని దీనదయాళ్ పురం, దిండి, గణపేశ్వరం, ఎదురుమొండి, గుల్లల మోద, హంసలదీవి, పాలకయతిప్ప, చింతకోల్ల, ఇరాలి వంటి గ్రామాల్లో సుమారు 15 వేలకు పైగా మంది మరణించారు. దివిసీమను ఆదుకునేందకు ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వంటి నేతలు దివిసీమను సందర్శించి, ప్రజలకు అండగా నిలబడ్డారు.