డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ – ఆకట్టుకునే సైబర్ క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు: సంగీతం – సైమన్ కె కింగ్, ఎడిటింగ్ – తమ్మిరాజు, డైలాగ్స్ – మిర్చి కిరణ్, సమర్ఫణ – సురేష్ ప్రొడక్షన్స్, నిర్మాత -డా. రవి ప్రసాద్ రాజు దాట్ల, కో–ప్రొడ్యూసర్ – విజయ్ ధరణ్ దాట్ల, కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం – కె వి గుహన్
స్టోరి
కథానాయకుడు విశ్వ (అరుణ్ ఆదిత్) ఆత్మహత్య సీన్ తో సినిమా బిగిన్ అవుతుంది. ఫస్ట్ సీన్ తోనే కథపై ఆసక్తి కలుగుతుంది. హీరో చనిపోతే ఎలా అనుకునేలోపు కొన్ని నెలలు కిందట ఏంజరిగిందంటే…అంటూ కథ మొదలుపెడతారు దర్శకుడు. విశ్వ అతని స్నేహితులు అష్రఫ్ (ప్రియదర్శి), క్రిస్టీ (దివ్య శ్రీపాద), సదా (సత్యం రాజేశ్) నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. దేశంలోని వివిధ నగరాల్లో నివసించే వీరు ఆన్ లైన్ ద్వారా పనిచేస్తుంటారు. క్రిస్టీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు మిత్ర (శివాని రాజశేఖర్)ను చూడగానే ఆమెను ప్రేమిస్తాడు విశ్వ. మిత్రకు విశ్వను పరిచయం చేస్తుంది క్రిస్టీ. ఇలా మిత్ర విశ్వకు స్నేహితురాలు అవుతుంది. మిత్ర సోదరుడికి విశ్వ ఉద్యోగం చూసి పెట్టడం ద్వారా వీళ్లు మరింత క్లోజ్ అవుతారు. మిత్ర వినయం, అందం, నిజాయితీ విశ్వకు నచ్చుతాయి. విశ్వ హెల్పింగ్ నేచర్ ను మిత్ర ఇష్టపడుతుంది. ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మిత్రను కలిసేందుకు విశ్వ బయలుదేరే టైమ్ లో లాక్డౌన్ అనౌన్స్ చేస్తారు. దీంతో మరికొద్ది రోజులు విశ్వ, మిత్ర వీడియో కాల్స్ లో కాలక్షేపం చేస్తుంటారు. ఇలా ఉండగా..ఒకరోజు క్రిస్టీ ఇంటికి ఒక క్రిిమినల్ వచ్చి ఆమెను కత్తితో పొడుస్తాడు, మిత్రను చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ దుండగుడు ఎవరు, అతనికి విశ్వకు ఉన్న శత్రుత్వం ఏంటి, ఆ క్రిమినల్ నుంచి మిత్ర ఎలా బయటపడింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
సినిమా అంతా కంప్యూటర్ స్క్రీన్ మీద చూపించడం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలో కనిపించే కొత్తదనం. సినిమాటోగ్రాఫర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కెవి గుహన్ దర్శకత్వం వహించడం ఈ సినిమాలోని మరో విశేషం. సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయినా తన ప్రతిభ చూపించేందుకు ఎక్కడా కథను దాటే ప్రయత్నం చేయలేదు కేవి గుహన్. కథను ఉన్నంతలో బ్యుటిఫుల్ గా తెరకెక్కించాడు. వీడియో కాల్స్ ద్వారా పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ చూపిస్తూ, ఇందులోనే ఓ లవ్ స్టోరీని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను, ఓ మంచి కథనూ చూపించారు దర్శకుడు కేవి గుహన్.
విశ్వ క్యారెక్టర్ లో అరుణ్ ఆదిత్ మెప్పించాడు. భావోద్వేగాలు, పశ్చాతాపం తన క్యారెక్టర్ లో చూపించాడు. మిత్ర పాత్రలో శివాని రాజశేఖర్ అద్భుతంగా నటించింది. ఓ చక్కటి తెలుగు అమ్మాయిలా సంప్రదాయంగా కనిపించిన శివాని..ఎమోషనల్ సీన్స్ లో ప్రతిభ చూపించింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చిత్రంలో శివానికి హీరోతో సమానంగా స్క్రీన్ టైమ్ ఉంటుంది. దివ్య, ప్రియదర్శి, సత్యం రాజేష్, వీళ్లందరి పాత్రలకు కథలో మంచి స్కోప్ ఉంది. వీళ్లంతా తమ తమ క్యారెక్టర్ లకు న్యాయం చేశారు. వైవా హర్ష వీలైనంత నవ్వించే ప్రయత్నం చేశాడు.
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ మంచి కథతో తెరకెక్కింది. తెలిసో తెలియకో కొందరు చేసే తప్పులు ఇతరుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ సినిమాలో చూపించారు. నేరం చేసేప్పుడు సులువుగానే ఉండొచ్చు, కానీ దాని చెడు ఫలితం కొన్ని జీవితాలను బలి తీసుకుంటుంది. ఇవాళ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో సైబర్ క్రైమ్ దాడికి గురవుతున్నవారే. ఎక్కడో ఏ దగ్గర మోసపోతున్నవారే. అలాంటి నేరాలు చేసేవారికి కనువిప్పు లాంటి సినిమా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మేకింగ్ ఇలా..టెక్నికల్ గా క్వాలిటీ కనిపించింది. ఒక మంచి కథతో ఆకట్టుకునేలా రూపొందిన సైబర్ క్రైమ్ మూవీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని చెప్పొచ్చు.
రేటింగ్ 3/5