నిజామాబాద్ జిల్లాల్లో చిరిగిన కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. జిల్లాల్లోని మొండోరా మండలం బస్సాపూర్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ కరెన్సీ నోట్లను చూసిన జనం ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఏదైనా లారీ నుండి పడి ఉంటాయా అని అనుమానిస్తున్నారు.
అంతేకాకుండా ముందుగా నోట్ల కట్టలు పడిపోయి ఉంటాయని ఆ తర్వాత వాహనాలు వెళ్లడం వల్ల చిరిగిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఏమైనా డబ్బులను తరలించే ప్రయత్నం చేసిందా అన్న అనుమానం కూడా రాగా… రిజర్వుబ్యాంకు అలా చేయదని పాత నోట్లను ఆ బ్యాంకు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి కాల్చివేస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ నోట్లన్నీ నకిలీవా లేదంటే బ్లాక్ మనీ కూడా అయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి..? ఎలా వచ్చాయి..? అన్నది తెలియాలంటే పూర్తి విచారణ కావాల్సి ఉంది.