పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి రోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వే జరుగుతుంది.
ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అలాగే జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు తొలుత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అలాగే రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వ తేదీ వరకు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ వర్గాలు శుక్రవారం ప్రకటన చేశాయి. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేబినెట్ కమిటీ స్పష్టం చేసింది. మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూనే సమావేశాలు జరుగనున్నాయి.