ఈ నెల 5 తేదీన భారత ప్రధానమంత్రి మోడీ ముచ్చింతల్, ఇక్రిసాట్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం BRKR భవన్ లో నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు.
వేదికల వద్ద తగు వైద్య శిభిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. VVIP సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. VVIP పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే RTPCR పరీక్షలను చేపట్టాలని, కోవిడ్-19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో నిర్వహించాలని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని, తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేయాలని R&B శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వీఐపీ సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.