హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిలోఫర్‌లో ఇంజక్షన్‌లు వికటించి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. ముఖ్యంగా నిలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కాకుండా అందులో పని చేసే ఆయాలు ఇంజక్షన్ చేయడం వల్లనే తమ పిల్లలు ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజక్షన్ ఇచ్చిన క్షణాల్లో చనిపోయారంటూ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ముక్కు పచ్చలారని ఈ చిన్నారుల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని.. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది అలెర్ట్ అయింది. ఈ విషయంపై నిలోఫర్ వైద్యులు స్పందించారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే చిన్నారుల ఆరోగ్యం విషమించిందని చెప్పారు. ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఆరోపణలతో మిగతా పిల్లల తల్లిదండ్రుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.