2005 సంవత్సరం.. జనవరి… సంక్రాంతి పండుగకు ముందు రోజు. సామా ఫణీంద్ర రెడ్డి. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. తనది తెలంగాణలోని నిజామాబాద్. సంక్రాంతికి బెంగళూరు నుంచి నిజామాబాద్‌కు వెళ్లాలి. బస్టాండ్‌కు వెళ్లాడు. బస్సులు లేవు. ఉన్న అరకోర బస్సుల్లోనూ కాలు పెట్టే పరిస్థితి లేదు.
రెడ్ బస్ గురించి తెలుసుకునే ముందు.. మనం ఓసారి 10 నుంచి 15 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్లయితే మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో ఎర్రబస్సులు ఉండేవి. పట్టణ ప్రాంతాల ప్రజలు.. గ్రామీణ ప్రాంత ప్రజలను ఎర్ర బస్సు పేరుతో ఆటపట్టించేవారు కూడా. ఏరా.. ఎర్ర బస్సు ఎక్కి వచ్చావా? అంటూ ఆటపట్టించే వారు. అప్పట్లో ఏపీఎస్సార్టీసీ బస్సులకు ఎర్ర రంగు వేసేవారు. అందుకే ఎర్ర బస్సు.. ఎర్ర బస్సు అంటూ పిలిచేవారు. ఆ పదాన్నే ఉపయోగించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఓ యువకుడు. ఎర్రబస్సు ఇంగ్లీష్ పదమే రెడ్ బస్.
రెడ్ బస్.. అంటే ఏంటో తెలుసు కదా? బస్సు టికెట్లను ఆన్లైన్లో ముందుగానే బుకింగ్ చేసుకునే ప్లాట్‌ఫాం. దానికి రూపకల్పన చేసింది తెలుగు కుర్రాళ్లే. చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన రెడ్ బస్.. తర్వాత సూపర్ సక్సెస్ అయింది. తర్వాత దాన్ని భారీ లాభాలకు అమ్మేశారు.
రెడ్ బస్‌ను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది..
2005 సంవత్సరం.. జనవరి… సంక్రాంతి పండుగకు ముందు రోజు. సామా ఫణీంద్ర రెడ్డి. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. తనది తెలంగాణలోని నిజామాబాద్. సంక్రాంతికి బెంగళూరు నుంచి నిజామాబాద్‌కు వెళ్లాలి. బస్టాండ్‌కు వెళ్లాడు. బస్సులు లేవు. ఉన్న అరకోర బస్సుల్లోనూ కాలు పెట్టే పరిస్థితి లేదు. ఓ ట్రావెల్ ఏజెంట్‌ను పట్టుకొని ఒక టికెట్ సంపాదించాడు. కానీ.. తర్వాత ఆ టికెట్ కూడా క్యాన్సిల్ అయింది. ఆ ట్రావెల్ ఏజెంట్‌నే మళ్లీ బతిలాడాడు. దీంతో అందరు ఆపరేటర్లకు ఫోన్ చేసి టికెట్లు ఉన్నాయా అని వాకబు చేశాడు ఆ ఏజెంట్. అప్పుడే ఐడియా వచ్చింది ఫణీంద్రకు. తన ఐడియాను తన స్నేహితులతో పంచుకొని రెడ్ బస్‌కు రూపకల్పన చేశాడు. ఫణీంద్రతో పాటు అతడి స్నేహితులు పసుపునూరి సుధాకర్, చరణ్ పద్మరాజు రెడ్ బస్‌కు ఆధ్యులు.
780 కోట్లకు అమ్మేశారు..
తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన రెడ్ బస్ దినదినాభివృద్ధి చెందింది. రెడ్ బస్‌ను ప్రారంభించాక.. ప్రయాణికులు ఎక్కువగా రెడ్ బస్ ద్వారానే టికెట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. వేలమంది ప్రయాణికులు రెడ్‌బస్‌ను ఉపయోగించడంతో ఏడాదికి 250 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. చిన్న కంపెనీగా మొదలైన సంస్థ.. తర్వాత పెద్ద కంపెనీగా అవతరించడంతో.. రెడ్ బస్‌పై కన్నేసిన ఐబీబో గ్రూప్ సంస్థ 780 కోట్లు వెచ్చించి దాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం 1000 కోట్ల టర్నోవర్
ప్రస్తుతం రెడ్ బస్ టర్నోవర్ 1000 కోట్లు. దేశ వ్యాప్తంగా 4500 రూట్లలో నడిచే బస్సు సర్వీసులకు రెడ్ బస్ టికెట్లను జారీ చేస్తుంది. 700కు పైగా ట్రావెల్ ఏజెన్సీలు రెడ్ బస్ వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. రోజూ 5 వేల టికెట్లను రెడ్ బస్ జారీ చేస్తోంది.
హార్వర్డ్ యూనివర్సిటీలోని ఎండీవర్ టీంలో స్థానం సంపాదించిన ఫణీంద్ర
దాదాపు 6 ఏళ్ల పాటు రెడ్ బస్‌ను విజయవంతంగా నడిపించిన ఫణీంద్రకు అత్యంత నమ్మదగిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల జాబితాలో చోటు దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ వరల్డ్.. ఫణీంద్రకు మూడో స్థానాన్ని ఇచ్చి సత్కరించింది. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం.. ప్రపంచంలోనే అత్యంత చురుకైన వ్యక్తిగా బిరుదు ఇచ్చింది. అంతే కాదు.. హార్వర్డ్ యూనివర్సిటీ ఫణీంద్రకు తన ఎండీవర్ టీంలో సభ్యత్వం కూడా ఇచ్చింది. దీంతో ఎండీవర్ టీంతో మెంబర్షిప్ పొందిన రెండో ఇండియన్‌గా ఫణీంద్ర చరిత్రకెక్కాడు.