వర్క ఫ్రమ్ హోమ్ కారణంగా.. ఉద్యోగులంతా కాస్త బరువెక్కారు. కాస్త కాదులేండి.. కొందరైతే.. చూస్తే అరే ఏంట్రా ఇలా అయ్యావ్ అనేంతలా అయిపోయారు. పాపం వాళ్లకా.. టైమ్ తో పనిలేకండా చాకిరి చేయాల్సి వస్తుందే. బ్రెయిన్ ఎంత కష్టపడినా.. బాడీ చెమటోడిస్తేనే కదా.. బరువు కంట్రోల్లో ఉండేది. కానీ ఇంటి దగ్గరుండి పనిచేసే వాళ్లకు.. శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడే ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి నెమరేస్తూ.. పనిచేసుకుంటూ ఉంటారు. కానీ అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు చాలానే వస్తాయి. అందుకే ఉద్యోగుల ఆరోగ్యం కాపడాలని. వారిని ఫిట్ గా ఉంచాలని ఆన్లైన్ బోక్రింగ్ సంస్థ జెరోదా సీఈఓ ఓ ఆఫర్ ప్రకటించారు. బరువు తగ్గిన వారికి బోనస్ ఇస్తామన్నారు.
జెరోదా సీఈఓ నితిన్ కామత్ తమ కంపెనీలో ‘ఫన్ హెల్త్ ప్రోగ్రామ్’ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) 25 కంటే తక్కువ ఉన్నవారు సగం నెల జీతం బోనస్‌గా పొందొచ్చని ప్రకటించారు. తమ కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగుల సగటు బీఎంఐ 25.3 శాతంగా ఉందని.. ఒకవేళ ఆగస్టు నాటికి దాన్ని 24 దిగువకు తీసుకొస్తే ప్రతి ఒక్కరికీ మరో సగం నెల జీతం బోనస్‌గా ఇస్తామని సీఈవో తెలిపారు.
బీఎంఐ సూచీ అనేది ఆరోగ్యాన్ని కొలిచేందుకు ఉత్తమమైన ప్రమాణం కానప్పటికీ.. ఆరోగ్యంగా ఉండేందుకు సులభమైన ప్రారంభమని నితిన్ కామత్ తెలిపారు. కరోనా, వర్క్ ఫ్రం హోం కారణంగా గత రెండేళ్లుగా ఉద్యోగుల ఆరోగ్యాల్లో అనేక మార్పులు వచ్చాయి.. అందుకే ఈ ఫన్ హెల్త్ ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టినట్లు ఆయన పెర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ 10వేల అడుగులు నడవాలని నితిన్ తెలిపారు. అయితే ఇది అదనంగా ఇచ్చే బోనస్ మాత్రమే అని, ఉద్యోగులు తాము ఎప్పటిలాగే బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు పొందుతారని వెల్లడించారు.
నితిన్ కామత్ గతేడాది కూడా ఇలాంటి ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఉద్యోగులు ఫిట్నెస్ టార్గెట్‌ను నిర్దేశించుకోవాలని చెప్పిన ఆయన.. ఆ లక్ష్యాలను చేరుకున్న వారికి లక్కీ డ్రా నిర్వహించారు. గెలిచిన వారికి రూ.10లక్షల నగదు బహుమతి అందించారు. అయితే మనం చేసే ప్రతి పనిలోనూ మంచి ఎంచే వాళ్లు కొందరంటే.. చెడును ఎంచే వాళ్లు ఉంటారుకదా.. నితిన్ కామత్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులను ఫిట్‌గా ఉంచేందుకు ఇలాంటి ప్రయత్నాలు మంచివేనని కొందరు అంటే..మరికొందరు మాత్రం ఇలాంటి ప్రయోగాల వల్ల చెడు జరిగే ప్రమాదమే ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారు.
అరే..మన కంపెనీల్లో కూడా ఇలాంటి ఆఫర్ ఇస్తే బాగుండు అని ఆలోచన మీకు ఈపాటికే వచ్చే ఉంటుందే..!
-Triveni Buskarowthu