కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న షాకింగ్ డిసీషన్ రాష్ట్రంలో మళ్లీ జల జగడానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీల మధ్య కొనసాగుతున్న వార్ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని, ఇందుకోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.
నదీ జాలాల పంపిణీకి సంబంధించి పాత ట్రిబ్యునల్ లోని నిబంధనలనైనా మార్చాలని, లేదా కొత్త ట్రిబ్యునల్ నైనా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వినతిని కేంద్ర న్యాయశాఖ సూత్రప్రాయంగా తిరస్కరించినట్లుగా ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. అధికారికంగా దీనిపైనా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నిజమే అయినట్లయితే రాష్ట్రంలో జల జగడం మరోసారి రంజుగా సాగనుంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు మరింత తీవ్రం కానుంది.
కేంద్రం నిర్ణయం నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు,రాష్ట్ర బీజేపీ నేతలను తూర్పారబట్టేందుకు కారు నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరును ఇరకాటంలో పెట్టి ఒక రకంగా పైచేయి సాధించారు. ఈ వివాదం ఎలా కొనసాగినా..కేంద్రం కొనట్లేదు..మేమే కొంటున్నాం అనే సందేశాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.
యాసంగిలో వరి వేయండి, ఆ ధాన్యాన్ని మేమే కొంటామని, కేంద్రాన్ని ఒప్పిస్తామని బీజేపీ చెప్పినా అదే సాధ్యం కాలేదు. అయినా సరే మేం ధాన్యాన్ని కొంటున్నామని ప్రజలకు ఓ మెస్సేజీ ఇవ్వడంలో టీఆర్ఎస్ విజయవంతమైంది. దాంతో పాటు కేంద్రం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందనే ఆరోపణ ఉండనే ఉంది. తాజాగా.. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కేటాయించేందుకు నిరాకరించిన కేంద్రం.. ఇంజిన్ ఫ్యాక్టరీని మాత్రం గుజరాత్ లో ఏర్పాటుకు ఓకే చెప్పింది. అలాగే తెలంగాణకు రావాల్సిన సంప్రదాయ వైద్య కేంద్రం.. గుజరాత్‌కు తరలిపోవడం గురించి మండిపడుతూ గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్‌కు రీట్వీట్ చేశారు కూడా.
కేంద్రం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని, ఐఐఎస్ఈఆర్‌లు 2 కేటాయిస్తే అందులోనూ రాష్ట్రానికి ఏం లేదని కూడా టీఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు. 16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని పేర్కొంటున్నారు. ఎన్‌ఐడీలు 4, మెడికల్ కళాశాలలు 157ల్లోనూ తెలంగాణకు సున్నా అని, 84 నవోదాయల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదంటూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. గిరిజన యూనివర్సిటీ హామీని కూడా నెరవేర్చడంలేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు ఈ జాబితాలోకి కృష్ణా ట్రిబ్యునల్ అంశం కూడా చేరనుంది. నీటి వాటాలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని, దీనిని సరి చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే అన్యాయ ధోరణి అవలంబిస్తుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ కు మరో అవకాశం దక్కినట్లయింది.ఈ వివాదం ద్వారా బీజేపీపై మరోసారి దాడికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది తెలంగాణ. కానీ.. కోర్టులో కేసు ఉంటే వివాదాన్ని తేల్చలేమని, పిటిషన్ ఉపసంహరించుకోవాలని కేంద్రం సూచించింది. ఆ మేరకు తెలంగాణ పాటించింది. కానీ.. సమస్యను తేల్చాల్సిన కేంద్రం మరోసారి చేతులత్తేసినట్లయింది. అయితే.. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చి ఓట్లు దండుకునే వ్యూహంగా చూడకుండా… కృష్ణా నది నీటి వాటాలో నిజంగా నష్టపోతున్న తెలంగాణకు న్యాయం చేసేందుకు అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది.