తెలుగు తేజం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. థాయిలాండ్ ఓపెన్ సెమీస్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్‌లో ఒలింపిక్ విజేత చెన్ యు ఫెయి చేతిలో 17-21, 16-21 స్కోర్‌తో సింధు పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌ను చెన్ కేవలం 43 నిమిషాల్లో సొంతం చేసుకున్నది. మూడవ సీడ్‌గా చెన్ పోటీ పడగా.. ఆరవ సీడ్‌గా సింధు ఈ టోర్నీలో బరిలోకి దిగింది. తొలి గేమ్ అర్థభాగం వరకు 7-11 స్కోర్‌తో సింధు వెనకబడి ఉంది.
అయితే పూర్తిగా ఆధిపత్య ఆటను ప్రదర్శించింది చెన్. ఇక రెండవ గేమ్‌లో ఓ దశలో 6-3 స్కోర్ తేడాతో సింధు లీడింగ్‌లో ఉన్నా ఆ తర్వాత చైనీస్ ప్లేయర్ గేర్ మార్చి ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఏడాది ఇప్పటికే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ టోర్నీల్లో సింధు విజేతగా నిలిచింది. ఇక జూన్ 7వ తేదీ నుంచి జరిగే ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలోనూ సింధు పాల్గొననున్నది.