జాతీయ రాజకీయాల్లో తన దైన ముద్ర వేసేందుకు సీఎం కేసీఆర్ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన జాతీయ పర్యటనకు వెళ్లారు. ఈ నెలాఖరు వరకు ఆయన వివిధ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. అంతేకాకుండా రైతుల ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేయనున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. కేసీఆర్ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్ వీక్షించారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్నారన్నారు. ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇందు కోసం తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపిస్తామని, ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయం చేయాలని చెప్పామన్నారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి మొత్తం ఆదర్శనీయమన్నారు.