ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది అనే చందంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వందల్లో డబ్బులు పోయాయని ఫిర్యాదు చేస్తే కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. ట్యూషన్ టీచరుగా పనిచేసే సదరు బాధితుడు నాసిక్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాడు. అయితే ఏదో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ బుక్ అవ్వలేదు.
తన ఖాతాలో కట్ అయిన రూ.578 తిరిగి రాకపోవడంతో అతను రిఫండ్ కోసం ప్రయత్నించాడు. ఐఆర్‌సీటీసీ హెల్ప్‌లైన్ నెంబరు కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఒక నెంబరు దొరికింది. కానీ అది ఒక సైబర్ మోసగాడి నెంబరు. ఈ విషయం తెలియని బాధితుడు ఆ నెంబర్‌కు కాల్ చేయడంతో.. అతన్ని మోసగించిన సైబర్ మోసగాడు. ఏకంగా రూ.1.78 లక్షలు కాజేశాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న ట్యూషన్ టీచర్.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.