టీడీపీ జూమ్ కాన్ఫరెన్సులో వైసీపీ నేతలు జొరబడ్డ ఎపిసోడుపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగులోకి కొడాలి నాని, వంశీ సహా వైసీపీ నేతలు జొరబడడంపై సీఐడీ చీఫ్ సునీల్ కుమారుకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు… కొడాలి నాని, వంశీ, కొత్తపల్లి రజనీ, దేవేందర్ రెడ్డిలు వేరే వారి పేర్లతో లోకేష్ జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చారని ఫిర్యాదులో వర్ల రామయ్య వెల్లడించారు.
వల్లభనేని వంశీ, కొడాలి నానీలు లోకేష్ తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారు… నాని, వంశీ చర్యలు నేరపూరిత కుట్రగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. గొడవలు పెట్టాలని ప్రయత్నించిన నాని, వంశీలపై నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి… వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారు…కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారని ఆగ్రహించారు. అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు… రాజకీయంగా గతంలో సైతం వీరు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. నేరపూరిత కుట్రతో జూమ్ మీటింగులోకి అక్రమంగా చొరబడ్డారని మండిపడ్డారు.