త్వరలోనే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు విజయశాంతి. టీఆర్ఎస్ నేతలకు అధికార గర్వం తలకెక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ గారిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండు. మోడీగారిని విమర్శించే స్థాయి కేసీఆర్ గారికి లేదని ఫైర్ అయ్యారు. అయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుండు. కేసీఆర్… నీ పప్పులు తెలంగాణలో ఇంకెంత మాత్రం ఉడకవు. ఈ పెద్ద దొరను చూసి.. చిన్న దొర కూడా బీజేపీ జాతీయనేత తల్లోజు ఆచారిని ఉద్దేశించి విశ్వకర్మలను అవమానపరిచేలా మాట్లాడిండని అగ్రహించారు.
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి సేవలు… తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంత్ చారి త్యాగాన్ని మంత్రి కేటీఆర్ మరచిపోయి ఆసామాజిక వర్గానికి చెందిన విశ్వకర్మలను అవమానించడం ఆయన ఆహంకార ధోరణికి నిదర్శనం. తెలంగాణ జాతిపిత, ఉద్యమ మార్గదర్శకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడారు. ప్రొఫెసర్ జయశంకర్‌గారిని, అమరుడైన శ్రీకాంతాచారిని సైతం అగౌరపరిచేలా వారి సామాజికవర్గం గురించి కేటీఆర్ అలా మాట్లాడటం ఎంతో బాధాకరమన్నారు.
తెలంగాణలో బీజేపీ బలపడటం చూసి టీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని విజయ సంకల్ప సభతో మరోసారి రుజువైంది. త్వరలోనే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నరు. కేసీఆర్… నువ్వు, నీ పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా… తెలంగాణ ప్రజలు మావైపే ఉన్నరు. అధికారపు అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజానీకం కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.