సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టనిల్లు. ఇక్కడ సర్వమత సౌభ్రాతుత్వంతో అందరూ మెలుగుతుంటారు. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా ప్రతి పండుగను అందరూ గౌరవిస్తుంటారు. ముస్లిం సోదరులకు ఎంతో ప్రత్యేకమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. అయితే.. ఈ బక్రీద్ పండుగ గురించి ప్రత్యేక కథనం.. సమాజంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా నడుచుకుంటూ అభివృద్ధి చెందుతారన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది బక్రీద్ పండుగ. రంజాన్ పండుగ అనంతరం 70 రోజుల తర్వాత ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చివరి నెల అయిన జిల్హజ్ మాసంలో పదో తేదీన బక్రీద్ పండుగ నిర్వహించుకోవడం అనవాయితీ వస్తోంది. ఖురాన్ ప్రకారం… అల్లాను అత్యంత ప్రీతిపాత్రంగా ప్రేమించే ఇబ్రహీం దంపతులకు ఎనబైయేళ్లు దాటినా సంతానం కలగలేదు. చుట్టుపక్కల వారు హేళన చేసేవారు. ఒకరోజు అల్లా ఇబ్రహీం కలలో కనిపించి ఇబ్రహం.. నీకు ఏం కావాలి? అని అడుగుతాడు.
సంతానం కలిగించాలంటూ ఇబ్రహీం కోరడంతో మూస అనే కొడుకును ప్రసాదిస్తాడు. కొన్నేళ్లు కుమారుడితో కలిసి సుఖ సంతోషాలతో జీవిస్తుండగా దేవుడు ఇబ్రహీం నిజాయితీని పరీక్షించేందుకు అత్యంత ఇష్టమైన దాన్ని తనకు బలి ఇవ్వాలని కోరతాడు. తనకు అత్యంత ప్రీతికరమైనది తన కొడుకేనంటూ, తన వద్ద అంత విలువైనది ఏదీ లేదంటూ ఇబ్రహీం దేవుడికి విన్నవిస్తాడు. తాను దేవుడి కోరిక మేరకు ఒక్కగానొక్క కొడుకును సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు ఇబ్రహీం. ఇబ్రహీం కొడుకును బలి ఇవ్వడాన్ని భరించలేక దేవదూతలు దేవుడిని ప్రధేయపడతారు. అనంతరం వారి సూచన మేరకు ఇబ్రహీం గొర్రె పిల్లను బలి ఇస్తాడు.
నాటి నుండి ముస్లింలు అల్లాను పూజించే క్రమంలోనే గొర్రెను బలి ఇచ్చి మాంసాన్ని ఇతరులకూ వితరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే అనాదిగా బక్రీద్ అంటూ జరుపుకుంటున్నారు. అయితే.. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటిచెప్తున్నదంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.