మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కు మరో షాక్ తగిలింది. తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం లో చేరిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది.
ఆ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకన్ ను చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. అయితే ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఠాక్రే, షిండే వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అత్యవసర విచారణ చేపట్టలేమన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఈ పిటిషన్లపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన షిండే వర్గానికి కాస్త ఊరట కలిగింది.