ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అఖిలపక్ష సమావేశానికి తేదీ ఖరారైంది. జులై 17న అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. 18వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే కానున్నాయి.
నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ సమావేశాలు చివరివిగా మిగిలనున్నాయి. సాధ్యమైనంత వరకు శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించే యోచన చేస్తున్నారు. ఏదైనా అవాంతరాలు ఎదురైతే మాత్రం వచ్చే బడ్జెట్ సమావేశాలు మాత్రం కొత్త భవనంలోనే ప్రారంభంకానున్నాయి. కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.