మంకీపాక్స్ లక్షణాలతో కేరళలో ఓ వ్యక్తి (22) మృతిచెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా అతని మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం తెలిపారు. అయితే ఆ యువకుడు మంకీపాక్స్‌తోనే మరణించినట్లు తాజాగా తేలింది. అతడి శాంపిళ్లను పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మృతితో దేశంలో మొదటి మంకీపాక్స్ మరణం నమోదైంది.
ఇటీవల యూఏఈ నుంచి తిరిగివచ్చిన ఆ యువకుడు శనివారం ఉదయం త్రిస్సూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను మంకీపాక్స్‌తోనే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని.. అతని శాంపిళ్లను పరీక్షలకు పంపించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం తెలిపారు.
జులై 21న కేరళకు వచ్చిన అతన్ని ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యమైందన్న విషయాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలిస్తున్నట్లు మంత్రి వీణా జార్జి చెప్పారు. అయితే, భారత్‌కు వచ్చేముందే యూఏఈలో ఆ యువకుడికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలగా, ఇక్కడికి వచ్చిన అతడు ఈ విషయాన్ని వైద్యుల వద్ద దాచిపెట్టినట్లు అతడి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.