భర్త ఉన్మాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ మూడునెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడని, అతడికి తన మృతదేహాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో రాసుకుంది. కలకలం రేపిన ఈ ఘటన బాలాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
షాహిన్నగర్ జుబైద్ కాలనీలో ఉండే దంపతులు ఖాజా మొహియుద్దీన్ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ(29) ఎంబీఏ చదివారు. చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్ పటేల్(30)తో గతేడాది ఫిబ్రవరి 1న వివాహమైంది. ఎవరితో మాట్లాడినా భర్త అనుమానించి బెల్టు, కర్రతో చితకబాదేవాడు. ఆడబిడ్డ భర్త, ఆయన కుమారులతో మాట్లాడినా విచక్షణారహితంగా కొట్టేవాడు. తన ప్రవర్తన గురించి… పుట్టింట్లో లేదా మరెవరికైనా చెబితే రివాల్వార్తో కాల్చి చంపుతానని బెదిరించే వాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు అందరికీ చూపిస్తానని హెచ్చరించేవాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావమైతే ఆనందపడ్డాడు. ఈ విషయాలన్నీ ఆమె డైరీలో రాసుకుంది.
ప్రస్తుతం మూడునెలల గర్భవతి. తల్లిదండ్రుల వద్ద ఉండాలని హెచ్చరిస్తూ గత నెలలో పంపించేశాడు. ఈనెల 1న షాహిన్నగర్లోని అత్త గారింటికి వచ్చి భార్యను దుర్భాషలాడుతూ చితకబాది వెళ్లిపోయాడు. ఇంతకాలం దాచిన తన భర్త నిజస్వరూపాన్ని పుట్టింటి వారికి వివరించి తనను కాపాడాలని వేడుకుంది. భార్యాభర్తలన్నాక గొడవలుంటాయిలే.. మాట్లాడదాం అంటూ వారు నచ్చచెప్పారు.
ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులకు తాళలేక చనిపోతున్నానని, భర్త, అత్తమామలు.. తన మృతదేహాన్ని తాకకుండా అడ్డుకోవాలని కోరింది. అదే తల్లిదండ్రులుగా మీరు నాకు చేసే మేలు అని డైరీలో రాసింది. తల్లి ఫిర్యాదుపై బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.