లాయర్ మల్లారెడ్డి హత్యకు రూ. 18 లక్షల సుపారి

-

న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 1న రాత్రి ములుగు మండలం పందికుంట క్రాస్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 5న రాత్రి నలుగురిని అరెస్టు చూపిన పోలీసులు.. ఆదివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ ములుగులోని పోలీసు ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్‌, హనుమకొండకు చెందిన పిండి రవియాదవ్‌, ములుగు మండలం కొడిశల కుంటకు చెందిన వంచ రామ్మోహన్‌రెడ్డి హత్యకు సూత్రధారులు. పథకాన్ని అమలు చేయడానికి వరంగల్‌ జిల్లా నారక్కపేటకు చెందిన తడక రమేష్‌ సహకరించాడు. ఈ నలుగురిని ఈనెల 5న అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు.

మిగిలిన వారిలో హనుమకొండ జిల్లా గంగిరేణి గూడేనికి చెందిన పెరుమాండ్ల రాజు(ఏ6), పెరుమాండ్ల రాకేష్‌(ఏ14), వరంగల్‌ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివ(ఏ11), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా కొక్కెరంచకు చెందిన ఈడిగ వేణు(ఏ12), ఈడిగ జయరాం(ఏ8), నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన బుక్కా వెంకటరమణ(ఏ9)లకు హత్యతో సంబంధాలున్నాయని నిర్ధారించి అరెస్టు చేశారు.

హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మల్లారెడ్డి కదలికలపై నిఘా పెట్టగా మిగిలిన నలుగురు పందికుంట స్టేజి వద్ద వేచి ఉన్నారు. న్యాయవాది ప్రయాణించిన కారు స్పీడు బ్రేకర్‌ వల్ల వేగం తగ్గించడంతో నిందితులు వెనక నుంచి మరో కారుతో ఢీకొట్టారు. ఆయన కారు దిగి పరిశీలిస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న నలుగురులు కత్తులతో పొడిచి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాకే పరారయ్యారు.

గంగిరేణి గూడెం వాసి పెరుమాండ్ల రాజు ఈ నేరానికి ప్రధాన కార్యనిర్వాహకుడు. రాజుకు బంధువు అయిన తడక రమేష్‌ 2020లో హత్య గురించి అతడితో చర్చించాడు. హత్య చేయడానికి ఇరువర్గాల మధ్య రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. రాజు కర్నూలు జిల్లాకు చెందిన జయరాం, వేణు, నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన వెంకటరమణ, నారక్కపేటకు చెందిన శివను ఒప్పించి రవీందర్‌ నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నారు.

మల్లారెడ్డి హత్య కేసులో మరో ఆరుగురు నిందితులకు ఈ నెల 18 వరకు రిమాండ్‌ విధిస్తూ హనుమకొండ జిల్లా ప్రధాన మునిసిఫ్‌ మెజిస్ట్రేట్‌ రాపోలు అనిత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు నిందితులను ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. మొత్తం 15 మందిపై హత్యానేరం, కుట్ర నేరాల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు గోనెల రవీందర్‌తోపాటు పిండి రవియాదవ్‌, వంచ రామ్మోహన్‌రెడ్డి, తడక రమేశ్‌ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా వారిని రిమాండ్‌కు తరలించారు. రవీందర్‌(ప్రధాన నిందితుడి కుమారుడు), బాల్నె వెంకన్న, జిట్టబోయిన సాంబమూర్తి, భరత్‌ అలియాస్‌ బన్ను, కక్కెర్ల సమ్మయ్య పరారీలో ఉన్నారని పోలీసులు తమ రెండో రిమాండ్‌ నివేదికలో పేర్కొన్నారు.

హత్యకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. కేసును నిష్పక్షపాతంగా సరైన పద్ధతిలో పరిశోధన చేసేందుకు ములుగు ఏఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కెకాన్‌ను కేసు పరిశోధన అధికారిగా నియమించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news