ఎన్డీఏ కూటమితో ఐదేళ్ల బంధం తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్ .. ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అనంతరం మహాకూటమి మద్దతుతో మరోసారి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా బిహార్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు.
భాజపా కూటమిలో నీతీశ్ కుమార్ సౌకర్యవంతంగా లేనందునే బయటకు వచ్చి ప్రత్యర్థి కూటమిలో చేరిపోయినట్లు వెల్లడించారు. అయితే, ఈ పరిణామాలు రాష్ట్రానికే పరిమితమన్న ఆయన.. జాతీయ స్థాయిలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
‘2017 నుంచి 2022 వరకు నీతీశ్ కుమార్ భాజపాతో కలిసి ఉన్నారు. కాన్నీ, ఎన్నడూ అక్కడ సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందుకే మహాకూటమితో ప్రయోగం చేద్దామని భావించి ఉండవచ్చు’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇక ప్రధాని పీఠంపై నీతీశ్ కుమార్ గురిపెట్టారని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆయన.. ప్రస్తుత పరిణామాలు కేవలం బిహార్‌కే పరిమితమని అన్నారు.
‘ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి 2012-13 నుంచి ప్రయోగం చేయడం ఇది ఆరోసారి. ఈ ఆరుసార్లు కూడా నీతీశ్ కుమార్ మాత్రమే ముఖ్యమంత్రి. అయినప్పటికీ బిహార్ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా కొంత మంచి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. అవినీతితోపాటు చాలా అంశాల్లో భిన్నాభిప్రాయాలున్న ఆర్జేడీ, జేడీ(యు)లు ఎటువంటి పాలన చేస్తాయో చూడాలన్నారు.