చౌటుప్పల్ టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బిజెపిలో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో వెంకట్ రెడ్డి బిజెపి కండువా కప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిఆర్ఎస్ టికెట్ ఇవ్వబోతుందని.. అసమ్మతి నేతలను లీడ్ చేసి వెంకటరెడ్డి గ్రూపు సమావేశం నిర్వహించారు. అయితే తాను పార్టీ మారబోతున్నందుకే తనపై మంత్రి జగదీశ్ రెడ్డి కక్షగట్టి అర్ధరాత్రి తన ఇంటికి పోలీసులు పంపించారని ఆరోపించారు వెంకటరెడ్డి.
వనస్థలిపురంలోని ఆయన నివాసానికి సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు. కుటుంబ సభ్యులు, బిజెపి నేతలు వారిని నిలదీయడంతో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే మంగళవారం షామీర్ పేట్ లోని ఈటల రాజేందర్ నివాసంలో బిజెపి కండువా కప్పి వెంకట్ రెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించారు ఈటెల.ఆయనతోపాటు చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి బుచ్చిరెడ్డి, టిఆర్ఎస్ చౌటుప్పల్ మాజీ మండలాధ్యక్షుడు కందిి లక్ష్మారెడ్డి, సీనియర్ నేత ఎడ్ల మహేందర్ రెడ్డి కమలం గూటికి చేరారు.