పోలవరం బకాయిలను 15రోజుల్లో విడుదల చేసేలా చూడండి : మోదీతో జగన్

-

దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు. ఆయనతో పలు విషయాలపై చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు. పోలవరం బకాయిలను 15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని మోదీని జగన్‌ కోరారు. సుమారు 40 నిమిషాలపాటు జగన్ మోదీ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో.. వివిధ అంశాలపై వినితిపత్రం అందజేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2వేల 900 కోట్ల రూపాయలను.. రీయింబర్స్‌ చేయాలని కోరారు. పోలవరం సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన.. 55 వేల 548 కోట్ల రూపాయల అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపోనెంట్‌వైజ్‌గా రీయింబర్స్‌ విధానానికి స్వస్తి పలకాలని, దీనివల్ల పనుల్లో.. విపరీత జాప్యం ఏర్పడుతోందన్నారు.

ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం విషయంలోనూ మొత్తం వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రీయింబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు . రీసోర్స్‌ గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన 32 వేల 625 కోట్ల రూపాయలను.. మంజూరు చేయాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ డిస్కంలనుంచి రావాల్సిన 6వేల756 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పిస్తే.. కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలు ఒడ్డున పడతాయని.. ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని సీఎం తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను వినతిపత్రంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news