తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను జరిపిన చర్చలపై జనతాదళ్(సెక్యులర్) కీలక నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య జరిగిన చర్చలు తృతీయ కూటమి ఏర్పాటు కోసం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి సోమవారం బెంగళూరులో మాట్లాడారు.
దేశంలోని రైతులు, మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా కేసీఆర్‌కు తనదైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా అమలు చేయాలో ఆయనకు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. ఒక చిన్న పార్టీగా తాము కూడా కేసీఆర్‌కు సహకరిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా కుమారస్వామి చెప్పారు.
దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎవరు గొంతు విప్పినా అందుకు తాము సహకరిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అనివార్యంగా మారిందన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో లక్ష్యాలతో పని చేయాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఈ దిశగా కేసీఆర్‌తో తాను చర్చించానని వివరించారు.ఆదివారం కేసీఆర్‌తో చర్చల అనంతరం దసరాలోగా కీలక నిర్ణయం వెల్లడిస్తామని కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.