వీఆర్ఏల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసింది. వీఆర్ఏల సమస్యలపై చర్చకు సిద్ధమైన సర్కారు 15 మందితో కూడిన వీఆర్ఏల బృందాన్ని అసెంబ్లీకి ఆహ్వానించింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో వీఆర్ఏ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని కేటీఆర్ అన్నారు. వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలు విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ కోరారు. సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం 20వ తేదీన వీఆర్ఏలతో చర్చలు జరుపుతామన్నారు. అయితే కేటీఆర్ తో భేటీ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తామని వీఆర్ఏ ప్రతినిధులు తెలిపారు.