కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధార్ యాక్టు 2016కు చేసిన మార్పులతో నూతన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా దానికి ముందుగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తరువాత తాజాగా లోక్‌సభలోనూ ఈ బిల్లును పాస్ చేశారు.
జనాలు ఒకప్పుడు ఆధార్ కార్డు అంటే భయపడేవారు. ఏ పనికి కార్డు కావాలంటారోనని చెప్పి ఆందోళనకు గురయ్యేవారు. ఆధార్ లేకపోతే తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవేమోనని చెప్పి ప్రారంభంలో పెద్ద ఎత్తున ఆధార్ నమోదు చేయించుకున్నారు. ఆ తరువాత ఆధార్ చట్టానికి అనేక మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అయితే ఆధార్ లేదని చెప్పి కొన్ని చోట్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు పొందలేకపోవడం, ఇక ప్రతి చోటా ఆధార్‌ను లింక్ చేయాలని అప్పట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ప్రజల ఆధార్ వివరాలు చోరీకి గురవుతున్నాయని పలువురు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీంతో అనేక సమస్యలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం తాజాగా లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధార్ యాక్టు 2016కు చేసిన మార్పులతో నూతన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా దానికి ముందుగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తరువాత తాజాగా లోక్‌సభలోనూ ఈ బిల్లును పాస్ చేశారు. ఇక ఈ బిల్లు ప్రకారం.. ఇకపై ఏ సంస్థ కూడా ఐడీ ప్రూఫ్ గా ఆధార్‌ను చూపించమని ప్రజలపై ఒత్తిడి తేరాదు. వారు తమకు తాముగా స్వచ్ఛందంగా ఆధార్ వివరాలు ఇస్తే తప్ప ఎవరూ ఆధార్ చూపించమని అడగరాదు. అలాగే పార్లమెంట్‌లో చట్టం చేస్తే తప్ప ఎవరూ ఎవరికీ ఆధార్‌ను బలవంతంగా చూపించాల్సిన పనిలేదు. ఆధార్ వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. పౌరులు తమకు తాముగా ఇస్తే తప్ప ఎవరూ ఒత్తిడితో ఆధార్ వివరాలను సేకరించరాదు.
ఇక ఈ బిల్లు ప్రకారం.. బ్యాంకులు కూడా ఆధార్‌ను అడగరాదు. వినియోగదారులు తమకు ఇష్టముంటే బ్యాంకులకు ఆధార్ వివరాలు ఇవ్వవచ్చు. అలాగే ఇతర సేవలను పొందేందుకు కూడా ఆధార్ వివరాలను కచ్చితంగా ఇవ్వాల్సిన పనిలేదు. అయితే పౌరులు తమ ఆధార్ వివరాలను ఇవ్వాలని తాము భావిస్తే.. 12 అంకెల ఆధార్ నంబర్ లేదా దాని స్థానంలో జనరేట్ చేయబడే వర్చువల్ ఆధార్ నంబర్‌ను కూడా ఇవ్వవచ్చు. దీంతో పౌరుల ఆధార్ సమాచారం సురక్షితంగా ఉంటుంది.
కొత్తగా తెచ్చిన ఆధార్ బిల్లు ప్రకారం.. ఆధార్ కార్డు కలిగిన పిల్లలు తమకు యుక్త వయస్సు వచ్చాక తమకు ఆధార్ అవసరం లేదనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసుకునే హక్కు వారికి ఉంటుంది. కాగా ఆధార్ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు చెందిన ఆధార్ వివరాలను సురక్షింతంగా ఉంచేందుకే బిల్లుకు మార్పులు చేశామని తెలిపారు. ఇక దేశంలో ఉన్న 123 కోట్ల మంది ప్రజలు ఆధార్ కార్డులు పొందారని, 70 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్స్‌ను ఆధార్‌కు అనుసంథానం చేశారని, రోజూ దేశ వ్యాప్తంగా 2.50 కోట్ల వరకు ఆధార్ ఆథెంటికేషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. కాగా భారత్‌లో అనుసరిస్తున్న ఆధార్ విధానాన్ని ఇతర దేశాలు కూడా ఫాలో అయ్యేందుకు చూస్తున్నాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు..!