టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​ రిటైర్మెంట్

-

టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​ రిటైర్మెంట్​ ప్రకటించాడు. వచ్చే వారం జరగనున్న లావర్​ కప్​ తనకు చివరి ఏటీపీ ఈవెంట్​ అని ట్విటర్​లో వెల్లడించాడు 41 ఏళ్ల స్విస్​ దిగ్గజం. 20 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు గెలిచి దిగ్గజ ఆటగాడిగా కీర్తి గడించాడు రోజర్​. తన క్రీడా ప్రయాణంలో తనకు సహకరించిన తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు, కుటుంబానికి ఫెదరర్ కృతజ్ఞతలు తెలిపాడు.

కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న ఫెదరర్​.. 2021 జులైలో జరిగిన వింబుల్డన్​ తర్వాత ఏ టోర్నీలోనూ ఆడలేదు. గ్రాండ్​స్లామ్​ల్లో ఒకటైన యూఎస్​ ఓపెన్ ముగిసిన కొద్దిరోజులకే ప్రొఫెషనల్​ టెన్నిస్​ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి అభిమానులకు షాకిచ్చాడు ఫెదరర్​. 310 వారాల పాటు టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడిగా ఉన్నాడు. తన 24 ఏళ్ల కెరీర్​లో 1500కుపైగా మ్యాచ్​లు ఆడానని చెప్పుకొచ్చాడు.

తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్విటర్‌లో నాలుగు పేజీల లేఖ పోస్టు చేశాడు. ‘‘ఇన్నేళ్లుగా టెన్నిస్‌ నాకిచ్చిన గొప్ప బహుమతి.. ఈ ప్రయాణంలో నేను కలిసిన వ్యక్తులే. నా స్నేహితులు, ప్రత్యర్థులు, అభిమానులు ఆటకు ప్రాణం పోశారు. మీ అందరితో ఓ వార్త పంచుకోవాలనుకుంటున్నా. గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నాకు సవాలు విసిరాయని మీకు తెలుసు. తిరిగి పూర్తి స్థాయి పోటీతత్వంతో ఆటలోకి తిరిగొద్దామనుకున్నా. కానీ నా శరీరం సామర్థ్యం, పరిమితులు నాకు తెలుసు. అది నాకు ఆలస్యంగా ఓ సందేశం పంపింది. నాకిప్పుడు 41 ఏళ్లు. 24 ఏళ్లకు పైగా 1500 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడా. నా కల కంటే టెన్నిస్‌ నాకెంతో ఇచ్చింది. వచ్చే వారం లండన్‌లో ఆడే లేవర్‌ కప్‌ నా చివరి ఏటీపీ టోర్నీ. భవిష్యత్‌లో టెన్నిస్‌ ఆడతా. కానీ గ్రాండ్‌స్లామ్‌ లేదా టూర్‌ టోర్నీల్లో పాల్గొనను. ఇదో చేదు తీపి కలగలిసిన నిర్ణయం. నాతో ప్రతి నిమిషాన్ని గడిపిన నా భార్య మిర్కాకు ధన్యవాదాలు. గత 24 ఏళ్లు 24 గంటలుగా అనిపిస్తోంది. మరోవైపు పూర్తి జీవితాన్ని గడిపేశాననిపిస్తోంది’’ అని అందులో ఫెదరర్‌ పేర్కొన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news