పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం.. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.
వైజయంతి మూవీస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలయ్యే అవకాశం ఉందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల వెల్లడించారు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన అయిదు యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక వ్యూహాలతో కూడిన ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి, నాలుగు వేర్వేరు యూనిట్లను నిర్మించనున్నారట. వీటిని రూపొందించడానికి నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను ఈ చిత్ర యూనిట్ రంగంలోకి దించనుంది. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ప్రాజెక్ట్ కె’ ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట.
ఇక ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ పాత్రను ఇతిహాస ఆధారిత అశ్వత్థామ పాత్ర స్ఫూర్తితో తీర్చిదిద్దనున్నారని సమాచారం. పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాల్లో బిగ్‌బీని చూపించనున్నారు. ప్రభాస్, అమితాబ్‌ల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించే ప్రణాళికను దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా రచిస్తున్నారట. ‘ప్రాజెక్ట్ కె’ ను పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్ డ్యూయల్ క్రొమాటిక్ టెక్నాలజీతో తీయనున్నట్లు తెలుస్తోంది.
అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారట. 2023 సంవత్సరాంతానికి ప్రాజెక్టు కె చిత్రీకరణ పూర్తి చేసి, 2024 ప్రథమార్థంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘ప్రాజెక్టు కె’ చిత్రాన్ని రూ.500 కోట్లు పైగానే బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.