తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. నలుగురు అదుపులోకి..

-

సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందన్న అనుమానంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ శిక్షణా కార్యక్రమాలపై ఎన్​ఐఏ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో 38 కోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్​లోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 26 మందిపై కేసు పెట్టారు.

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 23 చోట్ల జల్లెడ పట్టారు. నగరంలోని కంఠేశ్వర్​కు చెందిన ఓ వ్యక్తిని.. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారంలో ఓ యువకుడి ఇంట్లో సోదాలు చేపట్టి.. రెండు చరవాణులు, పాస్​పోర్టు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనూ దాడులు జరిగాయి. జగిత్యాల, కరీంనగర్​ జిల్లాల్లోనూ భారీ భద్రత నడుమ ఏకకాలంలో ఎన్​ఐఏ సోదాలు జరిపింది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనూ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

పీఎఫ్​ఐ కేసులో భాగంగా జరిపిన తనిఖీల్లో పలు కీలక దస్త్రాలు, ఎలక్ట్రానిక్​ పరికరాలతో పాటు రూ.8 లక్షల 31 వేలు స్వాధీనం చేసుకున్నామని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు క్యాంపులు పెట్టి శిక్షణ ఇవ్వడం, మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన అధికారులు.. మరో 26 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news