సోనియా గాంధీ వారసుడి కోసం.. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టేవారి కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక బరిలో నుంచి రాహుల్ తనంతట తానే ఔట్ అయ్యాక ఆ పదవికి ఎవరు ఎన్నికవుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది.
దేశవ్యాప్తంగా వరుస ఓటములు, సీనియర్లు, కీలకనేతల రాజీనామాలు, ఇతర పార్టీలోకి జంపింగ్ ల నేపథ్యంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతాయన్న కాంగ్రెస్ పార్టీ.. అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సోనియా, రాహుల్ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.