ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకున్న సపోర్ట్ చూస్తే షాక్ అవుతారని అన్నారు. దేశవ్యాప్తంగా తనకు కార్యకర్తల మద్దతు ఉందని తెలిపారు. ఏ స్థాయిలో తనకు సపోర్ట్ ఉందో నామినేషన్ వేసే రోజు తెలుస్తుందని చెప్పారు. అధ్యక్ష పోటీకి తాను ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిన శశిథరూర్.. సెప్టెంబర్ 30 నామినేషన్ చివరి రోజు తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి పోటీ గురించి గాంధీ కుటుంబంతో మాట్లాడినట్లు వివరించారు.
“నేను నామినేషన్ వేసేటప్పుడు నాకు ఎంత మద్దతు ఉందో మీరే చూస్తారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ వర్కర్లు నాకు మద్దతు ఇస్తే పోటీ చేస్తా. చాలా మంది కార్యకర్తలు పోటీ చేయమని అడుగుతున్నారు. నామినేషన్ పత్రాలు నాకు అందాయి. పార్టీ నేతలను కలుస్తున్నా. పోటీ విషయంపై సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో మాట్లాడా. తమకేం అభ్యంతరం లేదని ముగ్గురూ స్పష్టంగా చెప్పారు. కేరళ కార్యకర్తలు సైతం నాకు అండగా ఉన్నారు.” – శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ