బిహార్ లో ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన హర్జోత్ను విద్యార్థినులు శఆనిటరీ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని అడిగారు. దానిపై స్పందించిన హర్జోత్.. ‘కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈరోజు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ పోతే.. చివరకు కుటుంబ నియంత్రణ మాటకొస్తే కండోమ్స్ కూడా ఉచితంగా అడుగుతారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చెప్పిన సమాధానం విని ఆ విద్యార్థినులు బిత్తరపోయారు.
అసలేం జరిగిందంటే.. పాఠశాల విద్యార్థినులతో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బిహార్ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్జోత్ కౌర్ మాట్లాడుతుండగా.. ‘ప్రభుత్వం ఉచితంగా ఎన్నో ఇస్తోంది. 20 – 30 రూపాయల విలువ చేసే రుతు రుమాళ్లు మాకు ఇవ్వలేరా?’ అని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మహిళా ఉన్నతాధికారి పై విధంగా స్పందించారు. విద్యార్థినులు కూడా వెనక్కు తగ్గలేదు. ‘ఓట్ల కోసం వచ్చినపుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా?’ అని నిలదీశారు. దీంతో హర్జోత్ కౌర్ ‘అయితే ఓట్లు వేయకండి. పాకిస్థాన్లా మారిపోండి’ అంటూ విద్యార్థులపై మండిపడ్డారు.