ఇంగ్లండ్‌ గెలిచింది*
* నియమాలు వర్తించాయి

-

ఎలా అయితేనేమి? ఇంగ్లండ్‌ ఎట్టకేలకు కప్పు ఎత్తుకుంది. ఆటతో కాకపోయినా, నియమనిబంధనలతోనైనా కప్‌ పుట్టింటికి చేరింది. న్యూజీలాండ్‌ అసమాన పోరాటం నిజమైన విజేతను ప్రపంచానికి పరిచయం చేసింది. ఏ గప్తిల్‌ అయితే తన ఫీల్డింగ్‌తో ధోనీని రనౌట్‌ చేసి భారత ఆశలకు గండికొట్టాడో, అదే గప్తిల్‌ తన ఓవర్‌త్రోతో కప్‌ను దూరం చేసుకున్నాడు.

అబ్బ… చచ్చాం బాబోయ్‌… ఇదేం మ్యాచ్‌రా బాబూ.. ప్రతీ బాల్‌ ఇలా టెన్షన్‌ పెడితే, ఎలా బతకాలి? ఇదే కనుక, ఇండియా అయితే, సగం జనాభా చచ్చుండేవాళ్లు.. కన్నీళ్ల వరదల్లో దేశం మునిగిపోయేది. మామూలుగా మ్యాచ్‌ టై అవడమే కష్టం. అదీ ఫైనల్లో. మళ్లీ సూపర్‌ ఓవర్‌ కూడా టై. ఇక నరాలు చిట్లకుండా ఎలా ఉంటాయి? మరి ఇంగ్లండ్‌ ఎలా గెలిచింది?

ఇంతకుముందు వరకు అంటే, 2015 వరకు ఇలా సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే, ఇరుజట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటించేవారు. ఈసారి నుంచే రూల్స్‌ మార్చారు. అలా జరిగినప్పుడు, అదే మ్యాచ్‌లో, సూపర్‌ఓవర్‌లో కలిపి ఎవరు ఎక్కువగా బౌండరీలు సాధించిఉంటే ( ఫోర్లు, సిక్స్‌లు కలిపి) వారే విజేత. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ 241 పరుగులే చేసినప్పటికీ ఇంగ్లండ్‌ 24 బౌండరీలు, న్యూజీలాండ్‌ 16 బౌండరీలు కొట్టడంతో, నియమనిబంధనల ప్రకారం ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. అయితే ఈ బౌండరీలు మ్యాచ్‌, సూపర్‌ఓవర్‌ కలిపి చేసినవి.

కానీ, ఇది ఎలా సమంజసం? న్యూజీలాండ్‌ 16 బౌండరీలే కొట్టినప్పటికీ, విజయానికి కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. ఇక్కడ బౌండరీ ప్రసక్తే లేదు. ఒక్క పరుగు తప్ప. అటువంటప్పుడు ఈ బౌండరీల లెక్కేమిటి? బౌండరీలు ఎప్పుడైనా స్కోరును పెంచడానికి ఉపయోగపడతాయి తప్ప, గెలవడానికి కాదు. బౌండరీలు కొట్టకున్నా, ఒక్క పరుగు ఎక్కువ చేసినవాడే విజేత. మరి ఈ రకంగా విజేతను ఎంపిక చేయడంపై క్రికెట్‌ అభిమానులు, మాజీ ప్లేయర్లు మండిపడుతున్నారు. సాధికారికంగా గెలవని ఇంగ్లండ్‌ను, రూల్స్‌ సహాయంతో గెలిపించడం ఐసీసీకి మచ్చతెచ్చేదే. అందునా అది ఫైనల్‌ మ్యాచ్‌. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే ఇదివరకటి సంప్రదాయమే బాగుండేది.

ఏదేమైనప్పటికీ, అధికారికంగా ఇప్పుడు ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ విజేత. వాదనలు ఎలా ఉన్నా, అన్ని జట్లూ ఒప్పుకున్న నియమనిబంధనలు కాబట్టి, న్యూజీలాండ్‌కూ తలవంచక తప్పలేదు.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news