రెండు మూడు రోజులలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సి డబ్ల్యూ సి) సమావేశం జరగనున్నట్లు తెలిపారు ఏఐసీసీ సంస్థగత వ్యవహారాల ఇన్చార్జి సెక్రటరీ డా. వంశీచంద్ రెడ్డి. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు అయిన తర్వాత జరిగే తొలి సిడబ్ల్యూసి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
ప్రస్తుతం పార్టీ పదవులలో ఉన్న వారిపై సిడబ్ల్యుసి సమావేశం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశంలో ఏ ఇతర పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సాటి రాదన్నారు వంశీచంద్ రెడ్డి. కార్యకర్తల నేతనని ప్రచారం సందర్భంగా ఖర్గే నే స్వయంగా ప్రకటించారని.. కార్యకర్తల మనోభీష్ట మేరకే ఖర్గే పని చేస్తారని వెల్లడించారు.
పార్టీ నిర్వాహణలో గాంధీ కుటుంబ ప్రభావం అనడం కంటే.. గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సలహాలు, సూచనలు తీసుకోవడంలో తప్పేముందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో సీనియర్ల అనుభవాలను, సలహాలను తీసుకోవడం సర్వసాధారణం అన్నారు.