టీ20 వరల్డ్ కప్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ అయింది. ఇవాళ జరిగిన ఇంగ్లండ్-ఐర్లాండ్ మ్యాచ్ కూడా సూపర్ ఎగ్జైటింగ్ గా ముగిసింది. 2010 వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచిన ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ మట్టికరిపించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు ఇంగ్లండ్‌కు 158 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మొయిన్ అలీ 24 పరుగులతో, లియామ్ లివింగ్‌స్టోన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.
2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ ఓడించి సంచనలం నమోదు చేయగా.. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌పై గెలిచి హిస్టరీ రిపీట్ చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం ఐర్లాండ్‌కు ఇదే తొలిసారి. టీ20 ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ 12వ స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ జట్టు మూడో స్థానంలో ఉన్నది.