‘‘తెరాస రూ.వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని సర్వేలు తేల్చిచెప్పాయి. దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత? ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదు? దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? లేక కేసీఆర్ ఫాంహౌస్ నుంచి వచ్చిందా? పార్టీ ఫిరాయించిన వారికి పెద్దపీట వేసింది టీఆర్ఎస్ అనే విషయాన్ని గ్రహించాలి.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని గ్రహించే టీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరతీసిందని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలకు రూ.వందల కోట్లు ఇవ్వడానికి బీజేపీ కుట్ర చేసిందంటూ ఆరోపణలు చేశారని.. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపించిందంటూ ప్రజల ముందు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకున్నది టీఆర్ఎస్ కాదా? చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా? ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచారు? పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసేది కేసీఆరే. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన పార్టీలోకి చేర్చుకున్నారు? టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది. మునుగోడులో ఓటమి టీఆర్ఎస్ కు కళ్ల ముందు కనిపించింది. ఆ ఓటమి అర్థమయ్యే కొత్త నాటకానికి తెరలేపారు.” అని ఆరోపించారు.