నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరిలో జన్కో మూడో యూనిట్ ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఇవాళ మరో ముందడుగు వేసినట్లు వెల్లడించారు. అత్యధిక సాంకేతిక టెక్నాలజీ తో ఏపీ జెన్కో ఈ ప్లాంట్ ను నిర్మించిందని.. ఇందుకు జెన్కోకు సీఎం జగన్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకి వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చానని అన్నారు. రూ. 36 కోట్ల మేర నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజ్ ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని అన్నారు. రూ.25 కోట్లతో మిని ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నామన్నారు. పెన్నా నది పై ముదివర్తి వద్ద రూ.93 కోట్ల తో సబ్ మెర్సబుల్ కాజ్ వే నిర్మిస్తామన్నారు.
ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా గత ప్రభుత్వాలు వీటిని పట్టించు కోలేదన్నారు సీఎం జగన్. నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడుతున్నామన్నారు. అందరి మంచి కోసమే ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉప్పుకాలువ పై హై లెవెల్ బ్రిడ్జి ని మంజూరు చేస్తున్నామన్నారు. నక్కల వాగు పై రూ.10 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.