తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఫిక్షనల్ సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ అందుకొని గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కెరియర్ కు మంచి జోష్ తీసుకొచ్చింది ఈ సినిమా. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కొడుకు అయినా వశిష్ట గతంలో హీరోగా ఒక సినిమా చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టి.. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ తో టైం ట్రావెల్ మూవీ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సరికొత్త కాన్సెప్ట్ తీసుకొని త్రిగర్తల చక్రవర్తి బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నటించిన తీరు.. అద్భుతమైన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ప్రేక్షకులంతా రెండవ భాగంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే బింబిసారా రెండవ భాగం కూడా ఉంటుందని దర్శక హీరో ప్రకటించారు. మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో మల్లిడి విశిష్ట ప్రస్తుతం సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి అని తెలుస్తోంది.
ఈ క్రమంలోని తాజాగా ఒక బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన వశిష్ట రెండవ భాగం సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. కళ్యాణ్ రామ్ కమిట్ అయిన ఇతర ప్రాజెక్టు పూర్తవడానికి వచ్చే ఏడాది జూలై వరకు సమయం పడుతుంది. తమ సినిమా షూటింగ్ జూలై తర్వాత ప్రారంభించాలని చూస్తున్నాము అని దర్శకుడు తెలిపారు. ఫస్ట్ పార్ట్ భారీ హిట్ అయినందున తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని.. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లి ఒక ఫాంటసీ సినిమా చూశారు.. అది క్లిక్ అయింది. సినిమా అంతా వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు రెండవ భాగం మనం ఏమి ఇస్తున్నామో తెలుసుకోవడానికి వారు ఆసక్తి కనబరుస్తారు. నేను వారికి కొత్తది ఇవ్వాలి.. కాబట్టి నాపై మరింత ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది అంటూ ఆయన వెల్లడించారు.