టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని..ప్లాన్ చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు..వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణలో తేలాల్సిందేనన్నారు. దీని వెనుక ఉన్నవాళ్లు.. పదవుల నుంచి తొలగిపోవాల్సిందేనంటూ..బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. అబద్దాల బీజేపీని పక్కన పెడదామని.. అభివృద్ధి టీఆర్ఎస్ వెంట నడుద్దామని కోరారు. మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు పెట్టనని కొట్లాడుతున్న కేసీఆర్ కావాలా? అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటేద్దాం… బీజేపీని తరిమికొట్టి మన వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామన్నారు. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాటలను ఇక్కడనే వదిలేసి వెళ్లిపోవద్దు. మీ ఊరెళ్లిన తర్వాత చర్చ చేసి నిజనిజాలు తేల్చాలి. ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే.. ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడ్తది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తదన్నారు.