బ్రిటన్ ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌పై ఓ వైపు ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తుంటే.. ఆ దేశ ప్రతిపక్షం మాత్రం విమర్శలు ఎక్కుపెడుతోంది. దీనికి కారణం ఆయన తీసుకున్న ఓ నిర్ణయం. అదేంటంటే.. ఇటీవల బ్రిటన్ హోం సెక్రెటరీ పదవికి రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ను తిరిగి అదే స్థానంలోకి తీసుకోవడం. మైగ్రేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆమెను.. తిరిగి పదవిలోకి ఎలా తీసుకుంటాని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వైవెట్టీ కూపర్ విమర్శించారు. దేశభద్రతకు బాధ్యత వహించే కీలక పదవిలో ఆమెను కూర్చోబెట్టడం సమంజసం కాదని, రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంలో భారీ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.
మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో హోం సెక్రటరీగా పని చేసిన బ్రేవర్మన్ మైగ్రేషన్‌కు సంబంధించిన అధికారిక పత్రాలను తన వ్యక్తిగత ఈమెయిల్ నుంచి సహచర ఎంపీలకు పంపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనికి బాధ్యత వహిస్తూ.. ఆమె పదవి నుంచి వైదొలిగారు. అయితే రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెను తిరిగి అదే స్థానంలోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
‘‘ బ్రేవర్మన్ను తిరిగి నియమించడం.. రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంలోని భారీ తప్పిదాన్ని కళ్లకు కడుతోంది. ఆయన అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఆమెను తిరిగి నియమించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశభద్రత కూడా ముఖ్యమని ప్రధాని గుర్తించాలి.’’ అని కాపర్ మీడియాకు వెల్లడించారు.