మేం గెలిస్తే లక్ష ఉద్యోగాలిస్తాం.. హిమాచల్ ప్రచారంలో ప్రియాంక హామీలు

-

హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధికార, విపక్ష పార్టీల అగ్రనేతలు పరస్పర విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. కంగ్రాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్ని నిర్మించనున్నట్టు హామీ ఇచ్చారు.

బీజేపీ హయాంలో హిమాచల్‌ ప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రియాంకా ఆరోపించారు. 63వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో మాదిరిగానే తమను గెలిపిస్తే హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు.

‘‘కాంగ్రెస్‌ లక్ష ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఇక్కడే కూర్చున్నారు. ఆయన గత మూడేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా 1.30లక్షల ఉద్యోగాలు కల్పించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే.. తొలి కేబినెట్‌ సమావేశంలోనే లక్ష ఉద్యోగాల కల్పించే అంశంతో పాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించే అంశంపై నిర్ణయం తీసుకుంటాం.’’ అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news