ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 చివరి అంకానికి చేరుకుంది. మెల్బోర్న్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఫైనల్ జరగనుంది. ఈ హడావుడిలో ఐపీఎల్ 2023కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. డిసెంబర్లో నిర్వహించే మినీ వేలం పాట కోసం నవంబరు 15 నాటికి అన్ని ఫ్రాంచైజీలు.. తమ రిటైన్ ప్లేయర్ల తుది జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు అందజేయాల్సి ఉంది. ఇప్పుడు జట్లన్ని ఈ పనిలో బిజీగా ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లిస్ట్ కూడా దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది జట్టులో ఉండే వాళ్లు ఎవరు? ఎవరిని మినీ వేలం కోసం విడుదల చేయాలి? అనే అంశాలపై ఇప్పటికే ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఓ నిర్ణయానికి వచ్చారట. అంచనాలకు అనుగుణంగా రాణించని ప్లేయర్లను వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యారట.
ఆరెంజ్ ఆర్మీ నుంచి ఔట్ అయ్యే ప్లేయర్ల జాబితా కాస్త పెద్దదే అని సమాచారం. రొమారియో షెప్పర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియమ్ గర్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, మార్కో జెన్సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకోనుందట.