తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు అంబటి రాంబాబ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అక్కడ ఇంజనీర్ ను అడిగానని.. ఎంత సమయం పడుతుందో తెలియదని ఆ ఇంజనీర్ జవాబు ఇచ్చారని తెలిపారు మంత్రి హరీష్ రావు.
అయితే, హరీష్ రావు చేసిన కామెంట్స్ పై ఏపీ జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు చాలా సాఫ్ట్ గా రియాక్ట్ అయ్యారు. తనదైన స్టైల్ లో హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ‘ఆ ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్పారో, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కించపరచడానికి పోల్చారో తెలియదు గాని, కాలేశ్వరం ప్రాజెక్టు వేరు. పోలవరం ప్రాజెక్టు వేరు. కాలేశ్వరం కేవలం 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీ. అంతా కంప్లీట్ లిఫ్ట్ ఇరిగేషన్. కానీ పోలవరం అలా కాదు. ఇది బహులార్ధకమైన ప్రాజెక్టు. 196 టిఎంసి స్టోర్ చేసుకొని గ్రావిటీ ద్వారా నీరు తరలిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు, పోలవరం ప్రాజెక్టుకు, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.