అక్కినేని నాగార్జున హీరోగా ఒకప్పుడు వచ్చిన మన్మథుడు 2 మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అదేపేరుతో మన్మథుడు 2 రూపంలో మరో మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మూవీ: మన్మథుడు 2
నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, సమంత, కీర్తి సురేష్, లక్ష్మి, ఝాన్సీ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున, కిరణ్ పి, వయాకామ్ 18
అక్కినేని నాగార్జున హీరోగా ఒకప్పుడు వచ్చిన మన్మథుడు మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆ మూవీలో నాగ్ పంచిండిన కామెడీ, సెంటిమెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే దానికి సీక్వెల్‌గా కాకపోయినా.. అదేపేరుతో మన్మథుడు 2 రూపంలో మరో మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మన్మథుడు లాగే మన్మథుడు 2 మూవీ కూడా కామెడీని పండించిందా.? మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ…
సాంబశివరావు అలియాస్ స్యామ్ (నాగార్జున) కుటుంబం అంతా 1928వ సంవత్సరంలోనే పోర్చుగల్ వచ్చి అక్కడ స్థిరపడతారు. అక్కడే మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు జీవిస్తుంటారు. ఇక స్యామ్‌కు పెళ్లి అంటే పడదు. దానికి దూరంగా ఉంటుంటాడు. కానీ అమ్మాయిలకు మాత్రం అతను ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంటాడు. ఓ వైపు అతనికి వయస్సు దాటిపోతూ ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్లు స్యామ్‌కు ఎప్పటికప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఓ దశలో కుటుంబ సభ్యుల పోరు పడలేక అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్)ను తన ప్రియురాలు అని చెప్పి ఇంటికి తీసుకువస్తాడు. కానీ ఆమె అద్దె ప్రియురాలు అన్న సంగతి స్యామ్ కుటుంబ సభ్యులకు తెలియదు. అయితే ఆ తరువాత ఏం జరుగుతుంది ? కుటుంబ సభ్యులకు నిజం తెలుస్తుందా ? చివరకు స్యామ్, అవంతికలు నిజంగానే ప్రేమలో పడతారా..? ఫైనల్‌గా ఏం జరుగుతుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని వెండితెరపై చూడాల్సిందే.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
గతంలో వచ్చిన మన్మథుడు మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అందుకనే అదే టైటిల్‌తో నాగార్జున మరోసారి మన ముందుకు వచ్చారు. ఇక ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో కొంత అంచనాలు కచ్చితంగా ఉంటాయి. అలాగే కామెడీ, సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ్ ఎలా అలరిస్తాడో కూడా మనందరికీ తెలుసు. సరిగ్గా మన్మథుడు 2 మూవీలోనూ నాగ్ అన్ని ఎలిమెంట్స్‌లోనూ చక్కగా నటించారు. ఆయన నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మన్మథుడు 2 మూవీ ఆద్యంతం తెరపై నాగార్జుననే కనిపిస్తారు.
ఇక బాగా వయస్సు మీరిన వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ? అని ముందుగానే చెప్పడంతో ఈ మూవీలో నాగ్ ఏజ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆ వయస్సులో లవ్ ఏంట్రా..? అన్న ప్నశ్న ఎవరికీ ఉత్పన్నం కాదు. ఇక పలు లిప్ లాక్ సన్నివేశాల్లో నాగార్జున కాస్త కష్టంగానే నటించినట్లు మనకు తెలుస్తుంది. సినిమా మొదటి భాగం మొత్తం నాగార్జున ఇంట్రడక్షన్, రాసలీలలతోనే సరిపోతుంది. ప్రేమించడం కాకుండా.. ప్రేమను పంచాలి.. అనే భావనతో హీరో క్యారెక్టర్ ముందుకు సాగుతుంది.
మన్మథుడు 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించిందని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్, సమంతలు కొంత సేపు ప్రేక్షకులను అలరించి వెళ్లిపోతారు. కామెడీని పండించే బాధ్యతను చాలా వరకు వెన్నెల కిషోర్ తీసుకున్నాడని తెలుస్తుంది. లక్ష్మి, ఝాన్సీ, రావు రమేష్‌లు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక మూవీకి సంబంధించిన సాంకేతిక నిపుణుల పనితీరుకు వస్తే.. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం అంతగా ఏమీ బాగాలేదనే చెప్పవచ్చు. ఒకప్పుడు మన్మథుడు మూవీకి దేవీ అందించింన సంగీతం బాగుంది. కానీ ఇప్పుడీ మూవీకి ఆ స్థాయి సంగీతాన్ని అందివ్వలేదు.
ఇక ఈ మూవీకి గాను సినిమాటోగ్రఫీ బాగుంది. పోర్చుగల్‌లో ఉన్న పలు అందమైన లొకేషన్లను చక్కగా చిత్రీకరించారు. కాగా ఎడిటింగ్ అక్కడకక్కడా వీక్ అనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో ఉన్న పలు సీన్లు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. పలు సీన్లను బాగా సెన్సార్ చేశారని మనకు మూవీని చూస్తే తెలుస్తుంది. ఇక చివరిగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి చెబితే.. ఈ మూవీ కథను అరువు తెచ్చుకున్నప్పటికీ దీన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు కొంత తడబడ్డాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో దర్శకుడు పలు సీన్లను తెరకెక్కించడంలో గాడి తప్పాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఓవరాల్‌గా చూస్తే.. ఈ మూవీలో రొమాన్స్ మరీ ఎక్కువవడం.. అనుకున్న పాయింట్లను స్పష్టంగా తెరపై చూపించడంలో విఫలమవడంతో.. మన్మథుడు సీక్వెల్ ప్రయోగం.. మన్మథుడు 2 మూవీ.. బెడిసికొట్టిందని చెప్పవచ్చు. మరి మరో రెండు, మూడు రోజులు ఆగితేనే గానీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలను బట్టి మూవీ ఆడుతుందా, ఫ్లాప్‌గానే మిగులుతుందా.. అనేది చెప్పవచ్చు..!